శ్రీ సత్యసాయి జిల్లా, అమరాపురం మండలం, హేమావతి గ్రామంలో గల హేంజేరు సిద్దేశ్వర స్వామి దేవాలయాల సన్నిధి ఎంతో ప్రసిద్ధిచెందిన దేవాలయం. మహాశివుడు 5.8 అడుగుల సిద్దేశ్వర రూపంలో చతుర్భుజ ఆకారంలో వెలసినాడు.
ఈ దేవాలయం క్రీ.శ. 9-10వ శతాబ్దంలో నిర్మించినది.ఇక్కడ వెలసిన దొడ్డేశ్వరాలయం శిల్పకళకు ఎంతో ప్రాముఖ్యమైనది. హేమావతి దక్షిణాది కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వెలసిన సిద్దేశ్వరస్వామి, దొడ్డేశ్వరస్వామి దేవాలయాలు పడమర ముఖద్వారం ఉండటం విశేషం. ఇక్కడి స్థంబాలు అన్నియు నల్లటి నునుపైన రాయితో చెక్కబడి ఉంటాయి. ఇక్కడి దేవాలయాలలో పురాణ ఇతిహాసాలను చెక్కిన తీరు చాలా అమోఘం.
వేరే దేవాలయాలలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గాలి వెలుతురు రావడానికి కిటికీలు, గవాక్షములు ఏర్పాటు చేయడం చూడవచ్చు. ఈ కిటికీలలో దేవతామూర్తుల విగ్రహాలు చెక్కడం చూడవచ్చు. ఇక్కడి వసారాలలో అష్టదిక్పాలకులతో కూడిన ప్రతిష్టాపన జరిగింది. నొళంబుల చేత నిర్మించబడిన ఈ దేవాలయం శిల్ప సౌందర్యనికి పెట్టింది పేరు.
నొళంబులు కట్టించిన ఈ ఆలయాలు వారి శిల్పశైలి, శివలింగములకు మరియు నంది విగ్రహాలకు ప్రత్యేకతగా నిలుస్తాయి. దేవాలయంలో గల అత్యంత విశాలమైన ఉద్యానవనం మైమరపించే శిల్పకళ ఇక్కడి దేవాలయానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.