శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి గ్రామములో వెలసియుండు శ్రీ, హెంజేరు సిద్దేశ్వరస్వామివారల బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరం మాఘబహుళ త్రయోదశి మొదలు ఫాల్గుణ శుద్ధ చవితి వరకు వారం రోజులు జరుగును. ఆంధ్ర, కర్నాటక రాష్ష్రాల సరిహద్దులో జరిగే అతి పెద్ద ఉత్సవం. ఈ వేడుకలు జరిగే రోజులలో ప్రభుత్వ యంత్రాంగం మరియు ఆలయ కమిటివారు పటిష్ట భద్రత కల్పించి భక్తాదులకు సకల సౌకర్యాలను కల్పిస్తుంది. జిల్లాలోని అన్ని ఆర్.టి.సి. డిపోల నుండి వందలాది ప్రత్యేక బస్సులు కేటాయిస్తారు.
మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలిరోజు, ఆలయంలో అఖండ పూజలు నిర్వహిస్తారు. అదేరోజు, స్వామివారికి రుద్రాభిషేకము చేస్తారు. రాత్రంతా భజన కీర్తనలతో వైకుంఠాన్ని తలపిస్తుంది. కీ॥ శే॥ తిమ్మమ్మగారి చింతచెట్ల ఫలసాయంతో ఈ పూజలు చేస్తారు. రెండవరోజున స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తారు. భానం అనే ప్రత్యేక కార్యక్రమం జరుగును. అప్పుడు దేవతాకార్యాల నిర్వహణకు సంబంధించి పరంపరగా వచ్చిన వారినుండి నైవేద్యమును తెచ్చి స్వామివారికి అర్చిస్తారు. నాటి రాత్రి హరికథ కాలక్షేపము ఉంటుంది.
అగ్నిగుండం : ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజున సుమారు లక్షలాదిమంది భక్తులు వివిధ వాహనములలో వచ్చి వారు తెచ్చిన ధూపం (సామ్రాణి), పంటల ధాన్యపు గింజలను దేవునికి నైవేద్యం పెట్టి, వాటిని అగ్నిగుండంలో వేసి కాలుతున్నపుడు, ఆ వాసన పీల్చి పునీతులౌతారు. సాయంత్రం వరకు భక్తులతో కిక్కిరిసి పోతుంది.
సిడిమాను : విదియ రోజున భక్తులు మొక్కుతీర్చుకొనుటకు, కొత్త కోర్కెలు కోరుకొనుటకు పురాతనమైన మానును గాలిలో త్రిప్పుతూ, దానికున్న తాడును పట్టుకొని గాలిలో తిరిగి అనంతరం పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు అన్నసంతర్పణ ఉంటుంది. ముత్యాలపల్లకిలో దేవుని ఊరేగించి రాత్రంతా హరికథా గానం చేస్తారు.
చిన్నరథోత్సవం : ఐదవరోజున చాలా చక్కగా అలకరించిన రథముపై స్వామివారి ఉత్సవమూర్తులకు పూజగావించి వాటిని రథముపై ఆసీనులుగాచేసి పురవీధులగుండా త్రిప్పుతారు.
బ్రహ్మ రథోత్సవం : చివరి పెద్దవేడుక ఫాల్గుణ శుద్ధ చవితి రోజున పురాతనమైన మవావిశిష్టత గల్గిన బ్రహ్మరథోత్సవంపై శివపార్వతులను ఆసీనులు గావించి పురవీధులగుండా కులమత, జాతి విచక్షణ లేకుండా అందరూ లాగుతారు. రథముపై అరటిపండ్లు, పూలు వేస్తారు. ధూపపు భస్మాన్ని ఇంటికి తీసుకొని వెళ్తే ఇంట్లో విషపురుగులు రావని ధూపాన్ని అగ్నిగుండంగుండా తీసుకొనివెళ్తారు.
చివరిరోజు వసంతోత్సవం హోలీ పండుగను మురిపిస్తుంది. ఆ రాత్రి శయనోత్సవంతో ఈ పండుగ ముగుస్తుంది.
హేమవతిలోని
ప్రముఖ శివాలయాలు
సిద్దేశ్వర స్వామి ఆలయం
చైత్రం, వైశాఖం మాసాలలో సంధ్యా సమయాలలో సూర్యకాంతి 5.8 అడుగుల ఎత్తు గల సిద్దేశ్వర స్వామిని తాకి చూడడానికి ఏంతో ఆహ్లాదంగా ఉంటుంది.
దొడ్డేశ్వర స్వామి ఆలయం
శ్రీ దొడ్డేశ్వర స్వామి ఆలయములో శైవ పురాణ కథలతో పాటు విష్ణవ పురాణ గాథలు కూడా చెక్కబడి ఉన్నాయి. అతిపెద్ద నంది దేవాలయానికి ఎదురుగా ఉంది.
చేళ భైరవ స్వామి ఆలయం
శ్రీ చేళభైరవస్వామి ఆలయములో బెల్లం నైవేద్యం చేస్తే వారి ఇంటి పరిసరాలకు పాము, తేళ్లు ఇంకా ఎటువంటి విషపురుగులు రాకుండా స్వామి కాపాడుతాడని విస్వాసం.
మల్లేశ్వరస్వామి ఆలయం
మల్లేశ్వరస్వామి ఆలయములో ఉదయం సూర్యకిరణాలతో లింగం ఎంతో ప్రకాశవంతంగా అగుపడును. ఇది దొడ్డేశ్వరాలయానికి ఎడమవైపున కలదు.
విరూపాక్షేశ్వర ఆలయం
ఆలయము శిల్పకళకు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయము దొడ్డేశ్వరస్వామి ఆలయానికి కుడివైపున కలదు. శివలింగానికి ఎదురుగా మండపంలో నంది చేతితో తాకితే శబ్దం వస్తుంది.
నవకోటమ్మ ఆలయం
సిద్దేశ్వరస్వామికి చెల్లెమ్మగా నవకోటమ్మను ఇక్కడి జనులు పూజిస్తారు. సంతాన ప్రాప్తికై నవకోటమ్మను పూజలు నిర్వహిస్తారు ఇక్కడి జనులు.